Saturday, May 23, 2026
HomeUncategorizedప్రజాస్వామ్యం అంటే 'ప్రశ్నించే హక్కు'.. శిక్షలు కేవలం ప్రజలకేనా?

ప్రజాస్వామ్యం అంటే ‘ప్రశ్నించే హక్కు’.. శిక్షలు కేవలం ప్రజలకేనా?

📰 Generate e-Paper Clip

పాలకులకు లేని నిబంధనలు.. పౌరులకు మాత్రం సంకెళ్లా?

​భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ నేడు ఒక సంధి కాలంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శిస్తేనో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనో చట్టపరమైన చర్యలు, అరెస్టులు వెనువెంతనే జరిగిపోతున్నాయి. కానీ, అదే రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు, ఎన్నికల వేళ రాజకీయ నేతలు గుప్పించిన ‘తప్పుడు వాగ్దానాల’ మాటేమిటి? ప్రభుత్వాలపై విమర్శలు చేసేవారిని దోషులుగా నిలబెట్టే చట్టాలు ఉన్నప్పుడు.. అబద్ధపు హామీలతో ప్రజలను వంచించే పాలకులపై చర్యలు తీసుకునే చట్టాల అవసరం లేదా? అన్న ప్రశ్న ఇప్పుడు సమాజం నుండి బలంగా వినిపిస్తోంది.
​ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే, అధికార యంత్రాంగం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చట్టాలను ఒక ఆయుధంగా వాడుకుంటోందని స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ప్రజల సేవకుడు మాత్రమే తప్ప యజమాని కాదు. కానీ నేడు పాలకులు తమను ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వేదికలెక్కి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ, ప్రజలను నమ్మబలికి అధికారాన్ని దక్కించుకుంటున్న నాయకులు, పీఠం ఎక్కిన తర్వాత ఆ వాగ్దానాలను గాలికి వదిలేస్తున్నారు. కోట్లాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలని, పేదలకు ఇళ్లని, రైతులకు గిట్టుబాటు ధరలని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రి తమ బాధ్యతలను విస్మరిస్తే వారిపై చట్టం ఎందుకు మౌనంగా ఉంటుంది అన్నది సామాన్యుడి వేదన. ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని తప్పుడు హామీలతో అధికారం పొందడం కూడా ఒక రకమైన మోసమే. మరి ఇలాంటి మోసాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసే చట్టం ఏది? సామాన్యుడు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే క్షణాల్లో స్పందించే వ్యవస్థ, ఏళ్ల తరబడి హామీలను అమలు చేయని పాలకుల విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉంటోంది?
​దేశంలో విమర్శించే గొంతును నొక్కే ముందు, వాగ్దానాలు నెరవేర్చని పాలకులను కూడా బోనులో నిలబెట్టే సరికొత్త సంప్రదాయం మొదలవ్వాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ప్రభుత్వం తీసుకువచ్చే జీవోలు లేదా చట్టాలు సమాజ హితం కోసం ఉండాలి కానీ, కేవలం అధికార పీఠాన్ని విమర్శల నుండి కాపాడుకోవడానికి ఉండకూడదు. పాలకులకు ఉండవలసిన స్వేచ్ఛ ప్రజలకు కూడా ఉండాలి. అధికారం అంటే కేవలం అణచివేత కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజల గొంతు నొక్కే జీవోలు తీసుకురావడం కన్నా, ప్రజల బతుకుల్లో వెలుగు నింపే వాగ్దానాలను అమలు చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను వంచించిన పాలకులను వెంటనే శిక్షించే విధంగా, అవసరమైతే అరెస్ట్ చేసే విధంగా కఠినమైన చట్టాలను తీసుకురావాలి. అటువంటి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది. అప్పటివరకు చేసే అరెస్టులు కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలుగానే మిగిలిపోతాయి. ఏ ప్రభుత్వమైనా తన పట్ల వస్తున్న వ్యతిరేకతను చూసి భయపడుతోందంటే, అక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడినట్లే. ప్రజలు తమ సమస్యల గురించి మాట్లాడినప్పుడు అది ప్రభుత్వానికి వ్యతిరేకతగా కాకుండా, దిద్దుబాటు చర్యగా పాలకులు భావించాలి.
​ఇలాంటి అణచివేత ధోరణి సమాజంలో కొనసాగితే, అది ప్రజల అసంతృప్తిని మరింత పెంచుతుంది తప్ప ఏమాత్రం తగ్గించదు. పాలకుల మీద కేసులు పెట్టే వెసులుబాటు లేని చట్టాలు ఉన్నంత కాలం, సామాన్యులపై మాత్రమే ప్రతాపం చూపే చట్టాలకు విలువేముంటుంది? ఒక సామాన్య పౌరుడు తన వేదనను వ్యక్తం చేస్తే దానిని నేరంగా పరిగణించడం భావప్రకటన స్వేచ్ఛను ఖూనీ చేయడమే. నిజానికి, ఎన్నికల మేనిఫెస్టోలకు చట్టబద్ధత కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. హామీలు నెరవేర్చని పక్షంలో ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నప్పుడే రాజకీయం పవిత్రం అవుతుంది. ప్రజలకు ఇచ్చిన అమీని అమలు చేయడంలో వెనుకబడిన ప్రభుత్వాల పట్ల న్యాయస్థానాలు కూడా సుమోటోగా స్పందించాలి. స్వేచ్ఛ అనేది కేవలం పాలకులకే పరిమితం కాకూడదు, అది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమానంగా దక్కాలి. ఏదో ప్రజా సమస్య మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలాంటి కఠినమైన జీవోలు తీసుకురాలేదు కదా అన్న ప్రజల వాదనలో నిజం ఉంది. అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరొకలా ప్రవర్తించడం పాలకుల ద్వంద్వ నీతిని చాటుతోంది.
ప్రశ్నించే గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యం కాదు, ప్రశ్న ఉత్పన్నం కాకుండా పరిపాలించడమే అసలైన విజయం. చట్టం ముందు అందరూ సమానమేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు కాపాడాలి. పౌరుల హక్కులను కాలరాస్తూ, కేవలం తమ అధికార బలంతో భయానక వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా వాయువులను పౌరులు పీల్చుకోనివ్వాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం పెరగాలి. మొదట ప్రజాప్రతినిధులు తమ తప్పులను సరిదిద్దుకోవాలి, తాము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి. హామీల అమలులో విఫలమైన నాయకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టిన రోజే, సామాన్య ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. అప్పటివరకు ప్రజాస్వామ్యం కేవలం మాటలకే పరిమితమవుతుంది తప్ప చేతల్లో కనిపించదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలను స్వీకరించే సహనాన్ని పెంచుకుని, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా, ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య మనుగడ అనేది పాలకుల బాధ్యతాయుత ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. పౌరుల గొంతుకను గౌరవించినప్పుడే దేశం పురోగమిస్తుంది.

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ 9848559863

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments