పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి విద్యుదాఘాతానికి బలి
గోవర్ధనపురంలో విషాదం.. నిరుపేద గిరిజన కుటుంబంలో తీరని శోకం
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు కూలీ పనులకు వెళ్లిన 14 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, గోవర్ధనపురం హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో ఓ కళ్యాణమండపం వద్ద వివాహ వేడుకల సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా అలంకరణ కోసం గుంజలు నాటే పనిని గోవర్ధనపురానికి చెందిన సురేష్ కుమారుడు మదన్ (14) చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు గుంజలు తగలడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై మదన్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ, డీఈ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆ కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారు? కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన బాలుడే అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లిన బాలుడి మృతి స్థానికులను కలచివేసింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా జనావాసాలు, రహదారుల పక్కన ఉన్న విద్యుత్ తీగల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
