తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్ సంచలనం
తొలి గంటలోనే 10 లక్షల డౌన్లోడ్స్.. 13,266 స్టోర్ల ఏర్పాటుకు ప్రణాళిక
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
హైదరాబాద్, నవంబర్ 26: ఆన్లైన్ షాపింగ్ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ ‘సేల్స్ బీజ్’ ఈ-కామర్స్ యాప్‌ను ఘనంగా ప్రారంభించారు. మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ మైనంపల్లి రజితతో కలిసి సంస్థ సీఎండీ కుకట్ల శ్రీనివాస్, శ్రీదేవి కడియాల యాప్‌తో పాటు టెర్రాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎండీ కుకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై నెలవారీ కిరాణా ఖర్చుల భారాన్ని తగ్గించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రోసరీస్, పండ్లు, కూరగాయలు, గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు తదితర ఉత్పత్తులను ఒకే యాప్ ద్వారా కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఆన్లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, క్విక్ కామర్స్ సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 66 నగరాలు, 1,200 మండలాలు, 12 వేల గ్రామాలను అనుసంధానిస్తూ మొత్తం 13,266 స్టోర్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 600 డార్క్ స్టోర్లను సిద్ధం చేశామని, సంక్రాంతి తర్వాత 10 నిమిషాల్లో డెలివరీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
యాప్ ప్రారంభమైన తొలి గంటలోనే 10 లక్షల డౌన్లోడ్స్ నమోదయ్యాయని, రానున్న రెండు నెలల్లో కోటి డౌన్లోడ్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నెలకు రూ.10 వేల కిరాణా కొనుగోలు చేసే కుటుంబాలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా అయ్యేలా ధరలు నిర్ణయించినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ స్టోర్ల ఏర్పాటుకు ఇప్పటికే 1.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. మహిళా సంఘాలు, గిరిజన సహకార సంఘాలు, స్థానిక తయారీదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.



