ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది
ఫకీర్ టేక్య తండలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పరిధిలో ఉన్న ఫకీర్ టేక్య తండలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాలోత్ సుగుణ, మూడవత్ యాకుబ్ నాయక్, వడ్త్యా రతన్ సింగ్ల ఆహ్వానం మేరకు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనగా, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, అది ఆ కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా కల్పించే ఒక గొప్ప కల అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలను సాకారం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం, వారికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందన్నారు. ఇల్లు అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, సొంతింటిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘనపురం గ్రామ మాజీ సర్పంచులు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల శంకర్ గౌడ్, డివిజన్ కార్యదర్శి తాటికొండ మల్లేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.



