చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించిన భూషణరావుపేట ప్యాక్స్ కమిటీ
ప్రాసెసింగ్ ప్రక్రియ, మిర్చి పొడి ఉత్పత్తి, అమ్మకం వివరాల సేకరణ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : జగిత్యాల డిసిఓ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు కథలాపూర్ మండలం భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గడ్డం స్వామిరెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మంగపేటలోని ఆదివాసీ సమ్మక్క - సారలమ్మ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చిల్లి ప్రోసెసింగ్ యూనిట్ కేంద్రాన్ని సందర్శించారు. చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించడానికి గల ప్రధాన ఉద్దేశ్యాన్ని పాక్స్ చైర్మన్ గడ్డం స్వామిరెడ్డి, సిఈఓ రాగుట్ల విజయ్ లు ములుగు జిల్లా మంగపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఎఫ్,పి,ఓ సిఈఓ బండారి నికితతో చర్చించారు. ప్రధానంగా చిల్లి ప్రోసెసింగ్ యూనిట్ ఇన్స్టాలేషన్, అందుకు అయిన మొత్తం వ్యయాన్ని, సంవత్సర కాలంలో మిర్చి సేకరణ ద్వారా ఉత్పత్తి చేసిన మిర్చి పొడి, మార్కెటింగ్, సంవత్సరం ఆదాయం ఇట్టి మొత్తం ప్రక్రియకు అవసరమయ్యే వర్కర్లు, మెయింటెనెన్స్, జీతభత్యాల గురించి అడిగారు. మంగపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సీఈవో బండారి నికిత వివరిస్తూ, ప్రధానంగా మిర్చి ప్రోసెసింగ్ యూనిట్ కు సంబంధించి, తాము మిర్చిని నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తామని, అందుకు గోనె సంచులతో పాటు రవాణా సదుపాయాన్ని కూడా తామే కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. అదే రీతిగా సేకరించిన మిర్చిని కోల్డ్ స్టోరేజీలో స్టోర్ చేసి, మార్కెట్ డిమాండ్ ను బట్టి బయటకు తీయడం జరుగుతుందని, అలా బయటకు తీసిన మిర్చిని శుద్ధికరించి, అధునాతన మిర్చి గ్రైండర్లో వేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా స్వచ్ఛమైన శుద్ధీకరించిన మిర్చి పొడి బయటకు వస్తుందని, అలా వచ్చిన మిరప పోడిని మార్కెట్ డిమాండ్ ను బట్టి ఒక కేజీ, 500 గ్రాములు, 100 గ్రాములుగా ప్యాకింగ్ చేసి, హోల్ సేల్ ధరలలో మార్కెట్ కు అలాగే ఆర్డర్స్ పై కార్గో చేయడం జరుగుతుందని తెలిపారు. కావలసినవారు నేరుగా చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ వద్దకే వచ్చి, కొనుగోలు చేస్తారని, తద్వారా వారు మార్కెట్లో వస్తున్న కల్తీ మిర్చి పొడికి బదులుగా నాణ్యమైన మిర్చి పొడిని తినగలుగుతున్నామని తమకు తెలపడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. ఒక్కరోజుకు 30 టన్నుల మిర్చిని గ్రైండ్ చేసి, మిర్చి పొడిని అందించే సామర్థ్యం కలిగిన మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించేందుకు దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. అనంతరం పాక్స్ డైరెక్టర్లు, రైతులకు సీఈవో బండారి నికిత, మంగపేట వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ మొత్తాన్ని, కోల్డ్ స్టోరేజ్ ను చూపిస్తూ, అక్కడ జరిగే ప్రక్రియను వివరించారు. ప్యాక్స్ డైరెక్టర్లు కూన అశోక్, లోక నర్సారెడ్డి, గాజ ప్రభాకర్, గడ్డం అరుణ్, లావుడియా రాజేష్, లైసెట్టి గణేష్, జవ్వాజి ఆదిరెడ్డి, క్యాతం సంజీవరెడ్డి, కర్రోళ్ల గంగారెడ్డి, ఆకుల నారాయణ, ఆకుల గంగారెడ్డి, పాక్స్ సిబ్బంది రవి, భానుచంధర్, సంజీవ్ లతో పాటు రైతులు శనిగరపు చిన్న చిలుకయ్య, గోపిడి మాధవరెడ్డి, గడ్డం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.



