అర్హులందరికీ సహాయక ఉపకరణాలు అందించేందుకు చర్యలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
అలింకో సహకారం తో ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 27
అర్హులైన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని సాయి గార్డెన్స్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అలింకో సంస్థ సహకారంతో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. నిర్ధారణ శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల నుంచి శిబిరానికి వచ్చిన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు వివిధ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన సహాయక ఉపకరణాల కోసం అర్హులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ధారణకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిర్ధారణ పరీక్షల అనంతరం అర్హులుగా గుర్తించిన వారికి త్వరలోనే అవసరమైన సహాయక ఉపకరణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి పరీక్షల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, సిడిపివోలు స్వరూప, సింధు రాణి, ఎఫ్ఆర్ వో రవికృష్ణ, ఇతర అధికారులు, అలింకో ప్రతినిధులు పాల్గొన్నారు.



