అమర వీరుల త్యాగాలతో కాంగ్రెస్, బిఆర్ఎస్ శవ రాజకీయాలు..
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిజెపిదే పెద్దన్న పాత్ర..
బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : తెలంగాణ అమర వీరుల త్యాగాలతో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తూ, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, అమరుల ఆత్మలు ఘోషించేలా వ్యవహరిస్తున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. తెలంగాణ మలి విడత ఉద్యమంలో 1200 మంది యువకులు, విద్యార్థులు అమరులయ్యారని దానికి కారణం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలేనని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2004 లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని అధికారాన్ని పంచుకున్నాయని, 2009 నవంబర్ 29,వ తేదీన కేసీఆర్ దొంగ దీక్ష చేపట్టి, బాత్రూంలో ఇడ్లీలు తిని, నిమ్మరసం తాగి దీక్ష విరమించడం వల్లే శ్రీకాంతచారి లాంటి వారు ఉద్యమాన్ని తమచేతుల్లోకి తీసుకొని తొలి అమరుడు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 లో డిసెంబర్ 09 తేదీన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించి, ఆంధ్ర పెత్తందార్ల ఒత్తిడికి తలొగ్గి ప్రకటించిన తెలంగాణ ఏర్పాటును వెనక్కి తీసుకోవడం వల్లనే 1200 మంది యువకులు, విద్యార్థులు అమరులయ్యారని అన్నారు. తర్వాత 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను హుజూర్ నగర్ నుండి పోటీ చేయడానికి బిఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆమెపై అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోటీలో దింపి ఓడించిన నీచమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ శంకరమ్మకు ఇటీవల వేదికల మీద సానుభూతి తెలియజేయడం సిగ్గుచేటని, ఎమ్మెల్యేగా గెలువని శంకరమ్మకు ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉన్న బిఆర్ఎస్ పార్టీ 2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎందుకు అవకాశం కల్పించలేదని, భారత క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి దేశానికి ద్రోహం చేసిన అజారుద్దీన్ మంత్రిగా ఎమ్మెల్సీగా ఎందుకు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి ఉద్యమాన్ని ఉద్యమకారులను అవహేళన చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రకాష్ జవదేకర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ తోసి పుచ్చడం వల్లనే తెలంగాణలో 1200 మంది అమరులు అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అప్పటి బిజెపి పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నేత స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని యువకులు విద్యార్థులు ఎవరు ఆత్మ హత్యలు చేసుకోవద్దని, బంగారు తెలంగాణను చూడడానికి బతికి ఉండాలని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టండి.. బిజెపి బేషరతుగా మద్దతు ఇస్తుందని పెద్దన్న పాత్ర పోషించడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, ఇది యావత్తు తెలంగాణ ప్రజలు మరచిపోలేదన్న విషయాన్ని కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు గుర్తెరగాలని హితవు పలికారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీల సంఖ్య కేవలం రెండు మాత్రమేనని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించిన సమయంలో కెసిఆర్ బిల్లుకు మద్దతుగా ఓటు వేయకుండా తప్పించుకున్నారని ఇప్పుడేమో తెలంగాణ తామే తెచ్చినట్టు గప్పాలు కొట్టడం సరికాదన్నారు.



