పదవులు పొందినప్పుడు ఉన్న ఉత్సాహం.. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారంలో ఎందుకు కనిపించడం లేదు?
గౌడ కులవృత్తిని కాపాడేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ ఆవేదన
గౌడ కులస్తుల ఓట్లు, మద్దతుతో రాజకీయంగా ఎదిగి వివిధ పదవులు పొందిన నాయకులు, బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే గౌడ సమాజాన్ని ఎందుకు మరిచిపోతున్నారని రంగోల్ల మురళి గౌడ్ ప్రశ్నించారు. పదవులు, హోదాలు, గుర్తింపు కోసం చూపించే ఆసక్తి గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కోసం ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.గౌడ కులస్తులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించాల్సిన నాయకులు, తమ బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని సూచించారు. కులవృత్తి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వంతో మాట్లాడటం, సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం, పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం నాయకుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు.కులవృత్తిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏమిటి?తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకునే గీత కార్మికులు నేడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృత్తిలో ఎదురవుతున్న ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, అధికారుల తనిఖీలు, ఇతర సమస్యలతో కార్మికులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు.ఒకప్పుడు గౌడ కులస్తులకు ప్రధాన జీవనాధారంగా ఉన్న కల్లుగీత వృత్తి నేడు అనేక సవాళ్ల మధ్య కొనసాగుతోందని, ఈ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కులవృత్తిని కాపాడుకోవడం అంటే కేవలం ఒక వృత్తిని కాపాడుకోవడం మాత్రమే కాదని, తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, వేలాది కుటుంబాల జీవనాధారాన్ని కాపాడుకోవడమని వివరించారు.గౌడ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన సమయం వచ్చింది గౌడ కులస్తుల సమస్యలపై ప్రతి నాయకుడు, ప్రతి సంఘం, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతతో స్పందించాలని రంగోల్ల మురళి గౌడ్ పిలుపునిచ్చారు. కులవృత్తి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి రావాలని కోరారు.ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రమాద బీమా, ఆర్థిక భరోసా, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించబడే వరకు తమ ఉద్యమం తరఫున నిరంతరం గొంతెత్తుతామని రంగోల్ల మురళి గౌడ్ స్పష్టం చేశారు. పదవులు అనుభవించడం మాత్రమే నాయకత్వం కాదని, సమాజానికి కష్టకాలంలో అండగా నిలబడి వారి హక్కుల కోసం పోరాడటమే నిజమైన నాయకత్వమని ఆయన పేర్కొన్నారు.



