Saturday, May 23, 2026
HomeUncategorizedసూర్య ప్రతాపం – వేసవి తాపం

సూర్య ప్రతాపం – వేసవి తాపం

📰 Generate e-Paper Clip

భానుడు భగ భగ మండుతూ నిప్పుల వాన కురిపిస్తుండు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ప్రాణాలకే ముప్పువాటిల్లుతుంది. వేసవికాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు, సూచనలు పాటించడం వల్ల వేసవిలో పొంచి ఉన్నవడదెబ్బ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

వడదెబ్బ ఎలా వస్తుంది: సాధారణంగా మనిషి శరీరంలో 80 శాతం నీరు ఉంటుంది. మండుటెండల్లో తిరిగినప్పుడు వేడి గాలుల తీవ్రతకు ఈ నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. చెమట రూపంలో నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి లవణాలు బయటకు పోతాయి. అవి శరీరములో ఉన్నంత సేపు మనిషి ధృఢంగానే ఉంటాడు. క్రమంగా వాటి పరిమాణం తగ్గుతుంటే ఒంటిలో నిస్సత్తువ ఆవహిస్తుంది. బాధిత వ్యక్తి చివరికి మంచి నీటిని సైతం తాగలేని స్థితికి వెళతాడు. అప్పుడు వడ దెబ్బ తగిలినట్లుగా భావించాలి.వడదెబ్బ లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత పెరగడం. ఉష్ణోగ్రత 40.6 డిగ్రీ సెల్సియస్ లేదా 105.1 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే ఎక్కువగుట. చర్మం పొడిబారడం, మూత్రం చిక్కని పసుపు రంగులో ఉండి మంటగా రావడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, తీవ్రమైన తలనొప్పి, చెమటలు పట్టకపోవడం, శరీరం నీటిశాతం కోల్పోవటం, బీపీ.తగ్గడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం మొదలైనవి. ప్రధమ చికిత్స : వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. దుస్తులు వదులుగా చేసి చల్లని గాలి తగిలే విదంగా చేయాలి. ఉష్ణోగ్రతను తగ్గించడానికి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో పలుమార్లు శరీరం తుడవాలి. ఉప్పు కలిపిన చల్లని మజ్జిగ లేదా కొబ్బరినీళ్లు, ఓ.ఆర్.ఎస్. ద్రావణం తాపించాలి. ప్రధమ చికిత్స చేసినప్పటికీ వ్యక్తి కోలుకోలేక పోతే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. అత్యవసర సేవల కోసం 108 కి ఫోన్ చేయాలి. ముందు జాగ్రత్తలతో వడదెబ్బ నివారణ సాధ్యం.చేయవలసినవి (నివారణ): ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయాలలోనే (ఉదయం 11 గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత) ఆరు బయట పనులు చేయాలి. తలకు టోపీ గాని రుమాలు లేదా టవల్ చత్రి (గొడుగు) గాని తప్పక ధరించాలి. వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. ద్విచక్ర వాహనదారులు ప్రయాణంలో తలకు హెల్మెట్ ధరించాలి లేదా మెత్తని టవల్ చెవుల పైనుంచి చుట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, పల్చని జావా, కొబ్బరి బోండాం, ఓ.ఆర్.ఎస్. ద్రావణం వంటి అధికంగా ద్రవపదార్ధాలు తీసుకోవాలి. తాజా పండ్లు కీరదోస, పుచ్చకాయ, ముల్లంగి, నానబెట్టిన సబ్జా గింజలు చాలా మంచిది. అన్నింటికీ మించి ప్రతిరోజు కనీసం 3నుంచి 5 లీటర్ల నీటిని తాగడం మంచిది.చేయకూడనివి : ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటి పనులు చేయడం, తిరగడం, ఆడటం చేయరాదు. నేరుగా ఎండకు వేడి గాలులకు గురికాకూడదు. ముదురు నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. తలపై టోపి లేదా టవల్ / రుమాల్ లేకుండా ఎండలో తిరగరాదు. మత్తుపానీయాలు (మద్యపానం) సేవించ వద్దు. అవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్ ) తాగవద్దు. అవి డీహైడ్రేషన్ ని పెంచుతాయి. నూనె ,కొవ్వు, మసాలతో కూడిన ఆహార పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి. పదేళ్ల లోపు పిల్లలు 65 ఏళ్లు దాటిన వృద్ధులు ప్రత్యేకించి ఎండల్లో తిరుగకూడదు. చిన్నారులు, వృద్దులుా అప్రమత్తంగా ఉండాలి. చర్మం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెల్సియస్ నుంచి 34 డిగ్రీల సెల్సియస్ (89. 6 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి 93.2 డిగ్రీల ఫారెన్ హీట్ ). బయటి ఉష్ణోగ్రత ఈ నార్మల్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనప్పుడు చర్మం స్వేద గ్రంధుల ద్వారా చాలా చెమటని ఉత్పత్తి చేసి శరీరం చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. వృద్ధుల్లో దీర్ఘకాలిక రుగ్మతలు, వయసు మీరిన ఇతర కారణాల వల్ల స్వేధగ్రంధులు సక్రమంగా పనిచేయక, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేక పోవడంతో ఎక్కువగా ఈ వయసు వారు వడదెబ్బకు గురయ్యే అవకాశముంది. అలాగే చిన్నపిల్లలు చెమటను పెద్దల కంటే తక్కువగా స్రవించట వల్ల వారు కూడా వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందువల్ల చిన్నారులు, వృద్ధులు ఎండకు ఆరుబయటకి వెళ్లకపోవడం చాలా మంచిది.అవగాహనతోనే అప్రమత్తం : ప్రతియేటా ఎండ తీవ్రత పెరుగుతోంది. ” వడదెబ్బ ప్రమాదకరం – జాగ్రత్తలతో నివారణ సాధ్యం ” అనే థీమ్ తో వైద్యఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు, కూలీలకు, తల్లులకు, ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ లక్షణాలను మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను ఆరోగ్య అవగాహన సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తూ, వడదెబ్బ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అన్ని గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండ్ లలో, మహిళా సంఘం లీడర్ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలైన ఓ.ఆర్.ఎస్. డిపో హోల్డర్ ల వద్ద తగినంత స్టాకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఓ.ఆర్.ఎస్. ద్రావణం ప్రత్యేక ప్రాణరక్షక పానీయం. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుని తాగాలో ప్రాయోగికంగా చేసి చూపించడం జరుగుతుంది. నాశబోయిన నరసింహ, కవి,రచయిత, ఆరోగ్య విస్తరణ అధికారి, 8555010108.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments