Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి దందా! సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 09:01 AM | 74 | Crime, TELANGANA, తెలంగాణ
రైతుల బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి దందా!  సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి

సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి వ్యాపారం?

 వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు సరఫరా 

వ్యవసాయ విద్యుత్ వినియోగంపైనా ఆరోపణలు..

 సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్ తెలంగాణ కెరటం  సంగారెడ్డి, నవంబర్ 5:


ఓవైపు నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు గుండ్లమాచనూర్‌లో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తోడి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామ సర్పంచ్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ నీటి వ్యాపారానికి సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి దందా!  సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి

హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచనూర్ గ్రామ శివారులో రైతుల వ్యవసాయ బోర్ల నుంచి నిత్యం నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోనే తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో పరిశ్రమలకు నీటిని ఎలా సరఫరా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

సర్పంచ్ పాత్రపై విచారణ జరపాలి!

గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ పాత్రపై వస్తున్న ఆరోపణలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల కరెంటుతో నీటి వ్యాపారమా?

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వినియోగిస్తూ వాటర్ ప్లాంట్ల ద్వారా పెద్దఎత్తున నీటిని తోడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వ్యవసాయ అవసరాల కోసం ఇచ్చే విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా? వాటర్ ప్లాంట్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భూగర్భ జలాలు అడుగంటుతున్నా పట్టించుకోరా?

ఒకవైపు భూగర్భ జలాల పరిరక్షణపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు గ్రామ పరిధిలో విచ్చలవిడిగా నీటిని తోడి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక కాలుష్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలకు నీటి కొరత కూడా తోడైతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల సంయుక్త తనిఖీలు ఎప్పుడు?

జిల్లా కలెక్టర్, భూగర్భ జలాల శాఖ, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని వాటర్ ప్లాంట్ల అనుమతులు, బోర్ల నుంచి నీటి తోడకం, ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు సరఫరా, విద్యుత్ వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

నీరు ప్రజల జీవనాధారం.. కొందరి వ్యాపార వస్తువు కాదు!

గుండ్లమాచనూర్‌లో నీటి సరఫరాపై వస్తున్న ఆరోపణలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? అక్రమాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: