యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరించాలి
– రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.. నాయకుల అరెస్ట్
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం, కొన్ని ఖాతాలను నిషేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ గొంతుకను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఖాతాలను నిలిపివేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సంస్థ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తూ, నిలిపివేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎండీ సలీం, పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్, కీసర డివిజన్ అధ్యక్షుడు మెడబోయిన వరుణ్ ముదిరాజ్, గుండ్లపోచంపల్లి అధ్యక్షుడు నవీన్, మేడ్చల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్, పోచారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, వంశీ, తరుణ్ తదితరులు పాల్గొని రాష్ట్ర నాయకత్వానికి సంఘీభావం తెలిపారు. అనంతరం నిరసనలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.



