జిల్లా అభివృద్ధి ప్రణాళిక ను పకడ్బందీ గా రూపకల్పన చేయాలి
- జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్
ఖమ్మం, నవంబర్ 2 1 : ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు . శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన పై కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి శాఖ తమ లక్ష్యాలను స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలుగా విభజించుకుని, నిర్దేశిత గడువులోగా వాటి సాధనకు పక్కా కార్యాచరణతో ఉండాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు విద్యుత్, పునరుత్పాదక ఇంధన, తాగునీటి రంగాల అభివృద్ధి లక్ష్యాలపై చర్చించారు. వ్యవసాయ రంగంలో భాగంగా 2032 మార్చి నాటికి రైతుల నికర ఆదాయాన్ని 15 శాతం మేర పెంచడం, 5 వేల ఎకరాల్లో లాభదాయక సాగు పద్ధతులను విస్తరించడం, డ్రోన్ల వినియోగం, యాంత్రీకరణ ప్రణాళిక చేయాలన్నారు. ఉద్యానవన శాఖ పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తరణతో పాటు డ్రిప్ ఆటోమేషన్ పెంచాలని, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 2030 నాటికి పశువుల్లో గాలికుంటు, పీపీఆర్, రేబిస్ వ్యాధుల పూర్తి నిర్మూలన, 4 వేలకు పైగా పశువుల షెడ్ల నిర్మాణం, పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధి, మత్స్య శాఖ ద్వారా చెరువుల అభివృద్ధి, ఆధునిక మత్స్య మార్కెట్ల నిర్మాణం, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నూతన 33/11 కేవీ సబ్-స్టేషన్ల నిర్మాణం, ఓవర్‌లోడ్ ఫీడర్ల విభజన, భూగర్భ కేబుల్ పనులు, వినియోగదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. టీజీరెడ్కో ద్వారా పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, మోడల్ సోలార్ గ్రామాల పథకాల కింద సోలార్ రూఫ్‌టాప్‌లు, వ్యవసాయ సోలార్ పంపుసెట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేతిపంపులు, పైప్లైన్ల మరమ్మతులు, నూతన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణ కార్యాచరణ కు కలెక్టర్ సూచించారు. సెర్ప్ శాఖ పరిధిలో జిల్లాలో మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములను చేయడం, వారిలో సగం మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఉదాహరణగా తెలిపారు. సాగునీటి శాఖ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందించడం, జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల వల్ల కలిగే సమస్యల పరిష్కారం వంటి అంశాలపై శాఖల వారీగా లక్ష్యాలు రూపొందించాలని అన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 2028 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5 లక్షలకు, 2033 నాటికి రూ.10 లక్షలకు పెంచే లక్ష్యంతో శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. 2033-34 నాటికి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చెందిన జిల్లాగా ప్రకటించే స్థాయికి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పని చేయాలని అన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాకుండా వాటి సాధనకు అవసరమైన వనరులు, చేపట్టాల్సిన పనులు, అమలు చేయాల్సిన విధానం, నిర్దిష్ట కాలపరిమితులను స్పష్టంగా పేర్కొనాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో అన్ని రంగాల సమతుల్య వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి రంగానికి సంబంధించి అవసరమైన గణాంకాలను సేకరించి విశ్లేషణ ఆధారంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
అంతకుముందు కలెక్టర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేశారు. ప్రజల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తు తిరస్కారంపై కారణాలతో సహా దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలిపాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు.



