యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల
- కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబర్ 21 (తెలంగాణ కెరటం ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 200 ఇళ్లను, 82 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 21 వాహనాలపై జరిమానాలు విధించారు. మొత్తం 151 చలాన్ల ద్వారా రూ.25,460 జరిమానా వసూలు చేశారు. సరైన పత్రాలు లేని 3 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే అక్రమ మద్యంకు సంబంధించి 4 కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డిఎస్పి కోరారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, జరిగే మోసాలు, అనర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అదేవిధంగా సైబర్ మోసాల గురించి వివరిస్తూ, నేరగాళ్ల మోసపూరిత ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు, ఓటీపీలను పంచుకోవద్దని సూచించారు. తమ ఇళ్లతో పాటు కాలనీల్లో ముఖ్యమైన కూడళ్లు, రహదారుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు, నేరస్తులను గుర్తించడానికి పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఎస్సైలు, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.



