- బంజారా బంధాల ఆత్మీయ కలయిక.. ఐక్యతకు వన సమారాధన వేదిక
- ఈ నెల 22న రఘునాథపాలెంలో అంగరంగ వైభవంగా వనవహోత్సవ వేడుకలు
- ఉమ్మడి ఖమ్మం జిల్లా బంజారా కుటుంబాలన్నింటికీ ఆత్మీయ ఆహ్వానం
- బంజారాల వనసమారాధన మహోత్సవ కన్వీనర్ పోరిక లచ్చిరాం నాయక్
ఖమ్మం, నవంబర్ 18 (తెలంగాణ కెరటం ): కుల బంధాల ఆత్మీయతను చాటుతూ.. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భావితరాలకు అందిస్తూ.. బంజారా జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా ఈ నెల 22న ఆదివారం బంజారాల వన సమారాధన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ పోరిక లచ్చిరాం నాయక్ తెలిపారు. పార్టీలు, వర్గాలు, సంఘాలకు అతీతంగా బంజారా కుటుంబాలన్నీ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఆనందంగా గడిపేలా ఈ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రఘునాథపాలెంలోని నాగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఆర్జీబీ మామిడి తోటలో ఆదివారం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి బంజారా కుటుంబాల సభ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, కళాకారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా తరలివచ్చి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు.
బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బంజారా జాతి ఐక్యత, అభివృద్ధి, సంక్షేమంతో పాటు విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ వన సమారాధనకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. నేటి బిజీ జీవితాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు కలిసి మనసారా మాట్లాడుకునే అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో.. జాతి మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి అనుబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని వివరించారు.
నీతి, నిజాయితీ, కష్టపడి జీవించే తత్వానికి ప్రతీకగా నిలిచే బంజారా జాతి గొప్పతనాన్ని చాటేలా సంప్రదాయ కళలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బంజారా నృత్యాలు, నెమలి నాట్యం, బిందెలతో చేసే సంప్రదాయ నృత్యాలు, కళాకారుల డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, ఆనందోత్సాహాల నడుమ రోజంతా ఉత్సవ వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పిల్లలు తమ జాతి మూలాలను, పెద్దలు తమ సంస్కృతి వైభవాన్ని మరోసారి గుర్తుచేసుకునేలా.. యువత సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకునేలా ఈ మహోత్సవం నిలవనుంది. కుటుంబాల మధ్య ఆప్యాయతలు పెంపొందిస్తూ, ఆత్మీయ పలకరింపులు, అనుబంధాల కలయికతో ప్రతి ఒక్కరికీ మధుర జ్ఞాపకాలను అందించాలనే లక్ష్యంతో కమిటీ సభ్యులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకను ఒక సంఘానికి లేదా ఒక వర్గానికి పరిమితం చేయకుండా యావత్ బంజారా జాతి కుటుంబ సమ్మేళనంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి పండుగగా భావించి తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. బంజారా జాతి ఐక్యతను చాటుతూ, రాబోయే తరాలకు సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని అందించే ఈ మహోత్సవాన్ని అందరి భాగస్వామ్యంతో చిరస్మరణీయంగా నిలపాలని పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో కో-కన్వీనర్లు భూక్యా మంగ్య నాయక్, మాలోత్ రామారావు నాయక్, కోశాధికారులు డాక్టర్ మంగీలాల్ జాదవ్, గంగావత్ రమేష్ నాయక్, కార్యదర్శులు భూక్యా శోభన్ నాయక్, భూక్యా చంద్రు నాయక్, వి. తిరుపతి నాయక్, గౌరవ సలహాదారులు మూడ్ బాల్ సింగ్ నాయక్, ధరంసోత్ చక్రవర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు.



