ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఉనికిని చాటుకునేందుకే మేకపోతు గాంభీర్యం బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : తెలంగాణలో బిజెపికి రాజకీయ ఉనికి లేదని, ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు గెలవరని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశ దింపుడు కళ్ళంలాగా ఉందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడి సొంత జిల్లాలో బిజెపి గెలిచిందని, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా బిజెపి పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో డీ.కే అరుణ గెలిచి బిజెపి ఉనికిని చాటుకుందని, రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యులుగా కొనసాగిన మల్కాజిగిరి నుండి పార్లమెంట్ సభ్యులుగా బిజెపి నుండి ఈటెల రాజేందర్ గెలిచాడని, అంతేకాకుండా కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను చిత్తుగా ఓడించి, కామారెడ్డిలో ముఖ్యమంత్రి స్థానాన్ని మూడో స్థానానికి పరిమితం చేసి, బిజెపి అభ్యర్థి కాటిపెల్లి వెంకటరమణారెడ్డి శాసన సభ్యులుగా విజయం సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని అన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాదులో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు గెలిచారని, తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తెరగాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపికి చెందిన అభ్యర్థులు విజయం సాధించిన విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన వరస ఎన్నికల్లో ఒకవైపు దేశవ్యాప్తంగా బిజెపి ప్రభంజనం వీస్తుంటే కాంగ్రెస్ పార్టీ దింపుడు కల్లం ఆశలతో వాపును చూసి బలుపు అన్నట్టుగా భ్రమిస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకొని మసలుకోవాలని అన్నారు. ఎప్పుడు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని తెలిసి స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రైతుల చేత ఎన్నుకోబడే సహకార సంఘాలకు జరిగే ఎన్నికల విధానానికి స్వస్తి చెప్పి, నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాలకు అధ్యక్షులను నియమించడం పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒప్పుకుందని అన్నారు. తెలంగాణలో త్వరలో జరుగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందని అన్నారు. అమిత్ షాకు దమ్ముంటే హైదరాబాద్ నుండి ఓవైసీ పై పోటీ చేయాలని సవాల్ విసరడం చికెన్ సెంటర్ ముందు కోడి తొడగొట్టినట్లుందని, ముఖ్యమంత్రికి దమ్ముంటే ఓవైసీపై అంత ప్రేమ ఉంటే గుజరాత్ నుండి అమిత్ షా పై పోటీ చేయించి గెలిపించుకోవాలని, ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యంలాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగుల కొమురెల్లి, మండల ప్రధాన కార్యదర్శులు తోడేటి గట్టయ్య, కోట మల్లేశం, నాయకులు కడారి జనార్ధన్, తడగొండ శ్రీనివాస్, జక్కుల హరీష్, కూన సాగర్, పెద్ది బీరయ్య, నిఖిల్ గౌడ్, కడారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
