రైతులకు ఏడీఏ పుణ్యవతి సూచన
కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 21
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏడీఏ పుణ్యవతి సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా కూరగాయలు, పప్పుధాన్యాలు, జొన్న తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఏడీఏ పుణ్యవతి, మండల వ్యవసాయ అధికారి స్వప్న, వ్యవసాయ విస్తరణ అధికారి నరేందర్ సందర్శించి పంటల సాగు విధానాలపై రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని తెలిపారు. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు జొన్న రకం సీఎస్‌వీ-41 విత్తనాలను కౌడిపల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఏడీఏ పుణ్యవతి కోరారు.



