*హైదరాబాద్‌కు నీళ్లు సరఫరా ఆపాలి.. ముందు సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి!*
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 24, నవంబర్
*లేదంటే ప్రజలతో కలిసి వాటర్ వార్‌కు కార్యాచరణ.. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరిక*
*సింగూర్‌లో నీళ్లున్నా సంగారెడ్డి ప్రజలకు తాగునీటి కష్టాలా? బీర్ కంపెనీలకు నీటి సరఫరాపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహం తీర్చడంలో ఎందుకు లేదు?*
*కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సింగూర్, మంజీరా జలాశయాలకు ఈ దుస్థితి.. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రజలను కరువు కోరల్లోకి నెట్టారు* .
సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంజీరా డ్యామ్‌ను సందర్శించారు.
హైదరాబాద్ సరఫరా అవుతున్న తాగునీటి పైప్ లైన్ లీక్ కావడం తో వెంటనే సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడారు... వెంటనే నీళ్ళు వృధా పోకుండా చూడాలని కోరారు...
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ..*
హైదరాబాద్‌కు నీళ్లు సరఫరా చేసే ముందు సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి. సొంత జిల్లా ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతుంటే ఇతర ప్రాంతాలకు నీటి సరఫరాపై చూపిస్తున్న శ్రద్ధ దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ముందస్తు ప్రణాళిక రూపొందించలేదని విమర్శించారు. సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో అందులో ఉన్న నీటిని ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వదిలేయడం ప్రభుత్వ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు.
సముద్రాల మీద వంతెనలు నిర్మిస్తున్న ఈ ఆధునిక కాలంలో.. నీటిని నిల్వ చేసుకుంటూనే మరమ్మతులు చేసే సాంకేతికత లేదా? నీళ్లను వదిలేసి మరమ్మతులు చేయడమేనా కాంగ్రెస్ ప్రభుత్వ ముందుచూపు? అని నిలదీశారు.
సింగూర్ జలాశయంలో ప్రస్తుతం సుమారు 1.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఈ నీటి నిల్వలు డిసెంబర్ వరకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి ప్రజల తాగునీటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
సింగూర్ జలాలపై సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ ప్రాంతాలు కూడా ఆధారపడుతున్నాయని, ఇంతటి కీలకమైన అంశంపై జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి, ముఖ్యమంత్రి కనీసం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు.
రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల ప్రజలకు వారానికి ఒక్కసారి కూడా సక్రమంగా నీళ్లు అందడం లేదు. మరోవైపు బీర్ కంపెనీలకు నీటి సరఫరా మాత్రం కొనసాగుతోంది. కంపెనీలపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజలపై ఎందుకు లేదు? ప్రజల దాహం కంటే కంపెనీల అవసరాలే ప్రభుత్వానికి ముఖ్యమా? అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న సుమారు 50 ఎంఎల్డీ నీటి సరఫరా కూడా నిలిచిపోతే సంగారెడ్డి నియోజకవర్గం తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మంజీరా నదిలో అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్రమ నీటి వినియోగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సింగూర్, మంజీరా జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంగారెడ్డి ప్రజల అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటి సరఫరాపై నిర్ణయం తీసుకోవాలి.
జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజల గొంతు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా? నీళ్లు ఇవ్వకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. అవసరమైతే ప్రజలను సమీకరించి వాటర్ వార్‌కు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజల తాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా భూతు పురాణాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, ప్రజల కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు.
మాటలతో మభ్యపెట్టే రోజులు పోయాయి.. నీళ్లతోనే ప్రజల దాహం తీరాలి. హామీలతో బతుకులు మారవు.. చేతల్లోనే పాలన కనిపించాలి. ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
సంగారెడ్డి ప్రజల తాగునీటి సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, జాఫర్, లాడే మల్లేశం, నాయకులు జీవీ శ్రీనివాస్, కసిని శ్రీకాంత్, విఠల్, మోహన్ సింగ్, పాండు తదితరులు పాల్గొన్నారు.



