రీసర్వే ద్వారా భూముల విస్తీర్ణంపై రైతులకు స్పష్టమైన వివరాలు అందించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్‌లో భూములు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూ విస్తీర్ణాన్ని రీ సర్వే చేశారని, ఇంకా ఎంత మిగిలి ఉందని, ఎన్ని రోజుల్లో రీ సర్వే పూర్తి చేస్తారని, భూముల కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగం తదితర అంశాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వేలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. భూముల కొలతలను పక్కాగా చేపట్టాలని సూచించారు. సర్వేయర్లు భూముల రీ సర్వే అనంతరం సంబంధిత రైతులకు సాగు విస్తీర్ణం ఎంత ఉందనే వివరాలతో స్పష్టతనివ్వాలన్నారు. భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా అదనంగా మరొక రోవర్ ను కేటాయించామని, మరొక గ్రామంలో భూముల రీ సర్వే ప్రక్రియను ప్రారంభించాలని సర్వేయర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్, సింగరాజుపల్లి, ల్యాదెళ్ల గ్రామాల సర్పంచులు పంచగిరి రాజు, చంద్రం, రవి యాదవ్, భూముల కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, డీఐ సతీష్ చంద్ర, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.
