అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు జర్మన్ భాష శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.రెండేళ్లలో మందమర్రి పట్టణంలోని ప్రతి కాలనీలో సి.సి. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు 1 కోటి 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, అధికారులతో కలిసి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ మందమర్రి మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో 58 లక్షల రూపాయలతో లక్ష్మీ భవానీ కాలనీలో చేపట్టిన అంతర్గత సి.సి. రోడ్డును ప్రారంభించి, 3వ వార్డులో ఖబ్రస్తాన్ వరకు 76 లక్షల రూపాయలతో అప్రోచ్ సి.సి. రోడ్డు, 19వ వార్డులో 59 లక్షల రూపాయలతో అంతర్గత సి.సి. రోడ్డు, 2 వార్డు, 22 వార్డులో 52 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే వారి సమస్యలు, అవసరాలు తెలుస్తాయని తెలిపారు. మందమర్రి పట్టణంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతనిస్తూ దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అత్యవసరమైన పనులను ముందుగా పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న రెండేళ్లలో పట్టణంలోని ఏ కాలనీలోనూ సి.సి. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేని పరిస్థితి ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మందమర్రి ప్రాంతం ఏజెన్సీ పరిధిలో ఉండటం, ప్రభుత్వ భూముల కొరత కారణంగా అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థతో చర్చించి సుమారు 7 ఎకరాల భూమిని గుర్తించామని, అక్కడ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, అర్హులైన పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మందమర్రిలో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలతో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా లాటరీ విధానంలో ఎంపిక చేసి ఇండ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, వృద్ధులకు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మందమర్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల కోసం సి.ఎం. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామని, పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. ఆర్.కె. ఓపెన్‌కాస్ట్ పరిధిలో కొత్త గని ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, మందమర్రిలో జర్మన్ భాష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా హైమాస్ట్ లైట్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అభివృద్ధి నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజల ప్రయోజనాలకే వినియోగిస్తామని తెలిపారు.అనంతరం మందమర్రి పట్టణంలో టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్మన్ భాష శిక్షణ తరగతులను సందర్శించి శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్లాడారు. 6 నెలలుగా శిక్షణ కొనసాగిస్తున్న అభ్యర్థులను అభినందించారు. ప్రస్తుతం బి-1 స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్న వారు బి-2 స్థాయిని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించడంతో పాటు అవసరమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 సంవత్సరాలకు పైగా పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ ప్లేస్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. శిక్షణ మధ్యలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో కొనసాగించాలని, నేర్చుకున్న ప్రతి నైపుణ్యం భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. జర్మన్ భాషా శిక్షణ పొందిన వారికి టామ్‌కామ్‌లో శిక్షకులుగా అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీలో టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద ప్రత్యేక చొరవతో అదనంగా 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ చేపట్టి త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. సి.ఎస్.ఆర్., డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, అమృత్ పథకం క్రింద చేపట్టిన అంతర్గత త్రాగునీటి పైపులైన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముల్కల్ల నుంచి గోదావరి నీటిని తీసుకువచ్చే పైపులైన్ మందమర్రి వరకు చేరుకుందని, కనెక్షన్ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తిచేసి, అవసరమైన రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన సుమారు 7 ఎకరాల భూమిని గుర్తించి, ఏజెన్సీ ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇళ్లు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, గృహ వసతి, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



