మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం
తెలంగాణ కెరటం - సూర్యాపేట జిల్లా:
మునగాల, నవంబర్ 26: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మాధవరం శివారులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మునగాల మండల కేంద్రానికి చెందిన బుర్ర పాపారావు (సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ నిర్వాహకుడు) గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కంకర డస్ట్ కోసం తన ట్రాక్టర్‌పై నేలమర్రి శివారులోని ఫ్యాక్టరీకి బయలుదేరారు. మాధవరం శివారులోని నేలమర్రి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి నుంచి నేలమర్రి రోడ్డు వైపు ట్రాక్టర్‌ను మళ్లిస్తున్న క్రమంలో, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపారావు ట్రాక్టర్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రెండు నెలల క్రితమే పాపారావు తల్లి మృతి చెందగా, ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోకముందే పాపారావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మునగాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.



