రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 6
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ శుక్రవారం కోస్గి పట్టణంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కోస్గిలోని సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో ఆయన రాకపోకలకు సంబంధించిన రూట్ మ్యాప్, కాన్వాయ్ వెళ్లే మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీలను ఏర్పాటు చేసి, రహదారులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రూఫ్‌టాప్ సెంట్రీలు, రోప్ పార్టీలతో పాటు కీలక కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించాలని ఆదేశించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే మార్గాన్ని ముష్రిఫా బోర్డర్ వరకు ఎస్పీ స్వయంగా పరిశీలించారు. మార్గమధ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, పోలీస్ బందోబస్తు, అధికారుల బాధ్యతలపై సంబంధిత పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనను ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహిస్తూ, భద్రతా ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ పరిశీలనలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఏ. మహేష్, కోస్గి సీఐ సైదులు, ఆర్ఐ విజయ్ భాస్కర్, ఎస్సైలు చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



