ట్యాంక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు అందని మంచినీరు
తెలంగాణ కెరటం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోపులాపూర్ గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. అయితే ప్రభుత్వం మారింది.. పాలన మారింది.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రారంభమైంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ గోపులాపూర్ గ్రామం శెకల్ల రోడ్డు ప్రజలకు మాత్రం మిషన్ భగీరథ నీరు అందని పరిస్థితి నెలకొంది.
వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, అవసరమైన పైపులైన్ కనెక్షన్లు పూర్తి చేసి ట్యాంకులో నీటిని నింపి ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే ప్రశ్నలు గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజలకు సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
రానున్నది ఏలినో వేసవి కాలం కావడంతో గ్రామంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని గోపులాపూర్ గ్రామం శెకల్ల రోడ్డులో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుకు అవసరమైన పైపులైన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించి, ట్యాంకులో నీటిని నింపి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకును ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని, ప్రజల దాహార్తిని తీర్చే విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
