ట్రాన్స్‌జెండర్ల హక్కుల రక్షణపై అవగాహన
వివక్ష,వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి: ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల..
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం,హక్కులు మరియు వారికి కల్పిస్తున్న చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ జిల్లా ఇన్‌చార్జ్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పరిధిలోని ట్రాన్స్‌జెండర్లకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి హక్కులు,భద్రత, సంక్షేమం మరియు చట్టపరమైన రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం–2019 ప్రకారం ట్రాన్స్‌జెండర్లపై ఎలాంటి వివక్ష, వేధింపులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.విద్య, ఉపాధి,నివాసం తదితర రంగాల్లో ట్రాన్స్‌జెండర్ల హక్కులకు చట్టం రక్షణ కల్పిస్తుందని వివరించారు.ఎవరైనా అవమానించినా, వేధింపులకు గురిచేసినా లేదా తమ హక్కులకు భంగం కలిగించినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోని ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా ట్రాన్స్‌జెండర్ల భద్రత, సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.వారి హక్కులు మరియు చట్టపరమైన రక్షణపై సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
సమాజంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరూ వారిని గౌరవంతో, సమానత్వ భావనతో చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్‌ఐ హైమతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.



