దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)
అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం రామేలింగేశ్వర ఫంక్షన్ హాల్ నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం పలు మండలాలకు చెందిన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పింఛన్లకు అదనంగా కొత్తగా సుమారు 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల సంక్షేమం, అన్ని వర్గాల అభ్యున్నతేనని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, సన్నబియ్యం పంపిణీ ద్వారా కోటి పది లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
అర్హత ఉండి పింఛన్లు రాని వారు ఆందోళన చెందవద్దని, స్థానికంగా ప్రత్యేక కేంద్రాల ద్వారా దరఖాస్తుల్లోని లోపాలను సరిచేసి అర్హులందరికీ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారి ఖాతాల్లో ఈ నెల 19న నగదు జమ అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.



