బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 17 : వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. కథలాపూర్ మండలం సిరికొండలోని కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రైతులు గత 20 రోజులుగా వరి కోతలు కోసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్న సందర్భంలో ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, అదేవిధంగా అన్ని రకాల వడ్లకు వెయ్యి రూపాయల బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలలొ కొనుగోలును ప్రారంభించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత నెల రోజుల క్రితం రైతుల వద్ద నుండి వ్యాపారులు 4,500 రూపాయలకు క్వింటాల్ చొప్పున సన్నపు వడ్లను కొనుగోలు చేయడం జరిగింది కానీ, ఇప్పుడు రైతుల వద్ద ధాన్యం రావడంతో దాని ధర అమాంతంగా దించి వేయడం జరిగిందన్నారు. సిండికేట్ గా మారి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతు పాడుతుందని, వెంటనే రైతుల వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి వెయ్యి రూపాయల బోనస్ ఇచ్చి, కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా వేసవిలో పంటలకు ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగిందని, వెంటనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేసినచో రైతులకు మేలు జరిగేదని అన్నారు. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, అనేకమంది రైతులకు రుణమాఫీ చేయని ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 1,000 రూపాయల బోనస్ తో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఈ రైతులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, గాంధారి శ్రీనివాస్, ఏనుగు తిరుమల్ రెడ్డి, కాసోజు ప్రతాప్, ముంజ వెంకటేష్, ప్రమోద్, రాహుల్, వీరేందర్, సాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.



