మోత్కరావుపేట కు నూతన సబ్ స్టేషన్ మంజూరు
03 కోట్ల 30 లక్షలతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలం మోత్కరావుపేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడిసిఎల్ ) పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. మొత్తం రూ.03 కోట్ల 30 లక్షల 18 వేల అంచనా వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భీమారం మండలం మోత్కరావుపేట గ్రామంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు, దీర్ఘకాలిక ఫీడర్ల కారణంగా వినియోగదారులు తరచూ విద్యుత్ అంతరాయాలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. పెరుగుతున్న విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పెగ్గెర్లలో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది..తరచూ ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలను తగ్గించడంతోపాటు, పెరుగుతున్న గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. కాగా సబ్ స్టేషన్ మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు భీమారం మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.



