సర్వే నంబర్ 83లోని భూమిపై యథాతథ స్థితి కొనసాగించాలని బాధితుల డిమాండ్
కోర్టు కేసు పెండింగ్లో ఉండగానే భూమి వద్ద పనులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
తమ భూమికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 20: కోర్టులో భూ వివాదం కేసు పెండింగ్లో ఉండటంతో పాటు, యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వివాదాస్పద భూమి వద్ద పనులు చేపట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ముత్వేల్లిగూడ గ్రామానికి చెందిన అందే శ్రీశైలం, మట్ట విష్ణు గౌడ్ ఆరోపించారు. తమ తాతముత్తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఘట్కేసర్ మండలం కాచవానిసింగారం గ్రామ పరిధిలోని ముత్వేల్లిగూడ లో సర్వే నంబర్ 83లో సుమారు రెండు ఎకరాల భూమి గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇండ్లు, దొడ్లు, దారులుగా జాగీర్దారీ పొలం కింద రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని తెలిపారు. ఈ భూమిని తమ తాతముత్తాతల కాలం నుంచి తమ కుటుంబాలు అనుభవిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సర్వేలో తమకు ఏడు గుంటల వాటా ఉన్నట్లు తేలిందని వివరించారు. అయితే కేశవరెడ్డి, సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి భూమిని విక్రయించినట్లు సేల్ డీడ్ సృష్టించారని ఆరోపించారు. సురేందర్ రెడ్డి వచ్చిన తర్వాత తమ కుటుంబానికి చెందిన ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారని, ప్రస్తుతం తాము న్యాయస్థానంలో కేసును ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇదే వివాదంలో అవతలి పక్షానికి గతంలో జారీ చేసిన ఇంజక్షన్ ఉత్తర్వులు రద్దయ్యాయని, తమకు న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. అయినప్పటికీ ఇటీవల సుమారు 50 నుంచి 60 మంది గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద భూమి వద్దకు వచ్చి సర్వే నిర్వహించడంతో పాటు పనులు చేపట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై అత్యవసర పోలీసు సేవలకు ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టు ఉత్తర్వుల ప్రతులను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఫిర్యాదుపై తగిన స్పందన రావడం లేదని, అవతలి పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో భూ వివాదం పరిష్కారమయ్యే వరకు సర్వే నంబర్ 83లోని వివాదాస్పద భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. తమ భూమికి రక్షణ కల్పించడంతో పాటు, చట్టబద్ధంగా న్యాయపోరాటం చేస్తున్న తమకు న్యాయం చేసి కుటుంబానికి భద్రత కల్పించాలని అందే శ్రీశైలం, మట్ట విష్ణు గౌడ్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో సిద్ధ గొని కృష్ణ, బుర్ర మల్లేష్, బుర్ర శివమ్మ, బాధితులు తదితరులు పాల్గొన్నారు.



