- 👉డిపో మేనేజర్‌కు NVR ఫౌండేషన్ వినతిపత్రం
సోన్ మండలంలోని సంగంపేట్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ NVR సోషల్ వెల్ఫేర్ అకాడమీ ట్రస్ట్ (NVR ఫౌండేషన్) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ TGSRTC డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
NVR ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, రైతులు, కూలీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు సోన్, నిర్మల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలపై ఆధారపడుతూ అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రయోజనాలను సైతం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి, వినతిని పరిశీలించి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా, సంగంపేట్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ NVR సోషల్ వెల్ఫేర్ అకాడమీ ట్రస్ట్ డైరెక్టర్, BRS నాయకుడు నల్ల వినయ్ రెడ్డి గతంలో TGSRTC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన TGSRTC సపోర్ట్ టీమ్ ఫిర్యాదును నిర్మల్ డిపో మేనేజర్‌కు పంపించింది. ఇందులో భాగంగా సోమవారం NVR ఫౌండేషన్ టీమ్ సభ్యుడు షేక్ జాకీర్ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సంగంపేట్ గ్రామ ప్రజల రవాణా కష్టాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే బస్సు సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామని NVR ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.



