పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
త్వరలోనే తక్కలపల్లి, మన్నేగూడెం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
పల్లె గుట్టపైకి సీసీ రోడ్డు ప్రారంభించిన విప్
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారంతో కూడిన భోజనం అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శనివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమారం మండల పరిధిలో పర్యటించారు. భీమారం మండల కేంద్రంలో భారత్ ఎలక్ట్రిక్ నూతన షోరూంను ప్రారంభించారు. మన్నెగూడెం గ్రామంలో సైన్సు ల్యాబ్‌ను ప్రారంభించి, పల్లెగుట్టకు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు పేదింటి పిల్లలకు సైతం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో సుమారు 1,500 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని వెల్లడించారు. అదేవిధంగా మూడపల్లి సమీపంలో రూ.200 కోట్ల వ్యయంతో 2,500 మంది విద్యార్థులకు విద్య అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టడం విద్యారంగంలో కీలక ముందడుగు అని అన్నారు. సుమారు రూ.45 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను నియోజకవర్గానికి తీసుకురావడం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మేడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల మూడు దశాబ్దాల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాకారం చేసిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేశామని, తాజాగా మేడిపల్లికి కూడా కళాశాలను తీసుకురావడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. గురుకులాల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో గత పదేళ్లుగా పెరగని డైట్, కాస్మెటిక్ ఛార్జీలను ప్రజా ప్రభుత్వం పెంచిందన్నారు. డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వివరించారు.
పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నామని, ఇందులో భాగంగా మడిగూడకు చెందిన కోయిలకర్ అభిషేక్‌కు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడం ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. గతంలో పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల విజయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవారని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభకు కూడా సమాజంలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులను సత్కరించారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు సైతం ప్రతిభలో ఎవరికీ తీసిపోరనే విషయాన్ని తెలంగాణ సమాజానికి చాటిచెప్పారని అన్నారు. విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆకునూరి మురళిని చైర్మన్‌గా నియమించడం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం పునాది వేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న విద్యా విధానాలను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించడం అభినందనీయమని తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. టాటా సంస్థతో భాగస్వామ్యమై సుమారు రూ.4,000 కోట్లతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడం గొప్ప నిర్ణయమన్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఉట్నూర్‌లో తొలి బ్యాచ్‌కు చెందిన సుమారు 120 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలతో ఉద్యోగాలు పొందడం ఈ విధానం విజయానికి నిదర్శనమని వివరించారు. ఇదే తరహాలో పాలిటెక్నిక్ విద్యలోనూ ఆధునిక మార్పులు తీసుకొస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లతో చర్చించి వారి ఆమోదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ విద్యా చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆధునిక విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, కుటుంబ అభివృద్ధికి, సమాజ పురోగతికి పునాది అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లల్లోనూ అపారమైన ప్రతిభ ఉంటుందని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితమే అందుకు గొప్ప ఉదాహరణ అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లుగా ప్రజలకు ఏది ఇచ్చినా, ఇవ్వకపోయినా విద్యను మాత్రం ప్రతి ఒక్కరికీ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విద్యపై ఎంత ఖర్చు చేసినా, అది భవిష్యత్ తరాల అభివృద్ధికి పెట్టుబడేనని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పాఠశాలల్లో అవసరమైన సైన్స్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణంపై స్పందిస్తూ, అవసరమైన పాఠశాలల వివరాలతో కూడిన జాబితాను అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెండో దశలో మరిన్ని పాఠశాలలకు సైన్స్ ల్యాబ్‌లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని, అదనపు గదుల నిర్మాణానికి కూడా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పేద విద్యార్థి కలలు కనడమే కాదు.. ఆ కలలను సాకారం చేసుకునే అవకాశాలను కల్పించడమే ప్రజా ప్రభుత్వ విద్యా విధానమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.



