షో కాజ్ నోటీసులు జారీ..
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 02 : కోరుట్ల మండలంలోని కిషన్ రావు పల్లె శివారులోని రోజ్, శ్రీ రాజరాజేశ్వర స్పైసెస్ ఇండస్ట్రీస్ లతో పాటు కోరుట్ల పట్టణంలోని విజయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, వంటకాల తయారీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాల నేపథ్యంలో రోజ్ స్పైసెస్ ఇండస్ట్రీస్ కు రూ.13 వేల జరిమానా, శ్రీ రాజరాజేశ్వర స్పైసెస్ ఇండస్ట్రీస్ కు రూ.3.50 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ రెండు కేంద్రాలతో పాటు విజయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసి, వారం రోజుల్లోగా సంజాయిషి ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలు చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్లు రంజిత్ రెడ్డి, అనూష, ఖలీల్, అనుష పాల్గొన్నారు.



