-రైతులను ప్రైవేటు వ్యాపారుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
15 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు అనుమతులు, గోదాముల కేటాయింపులు లేవు.. రోడ్లపైనే రైతుల ధాన్యం
-తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06,తెలంగాణ కెరటం :
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాక నియోజకవర్గంలోని ఆల్మాస్పూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్, కూడవెల్లి, అక్బర్పేట, చిట్టాపూర్, హబ్షీపూర్, ధర్మారం, చెర్వాపూర్, ధర్మాజీపేట, దుంపలపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా ప్రారంభించారని తెలిపారు. ఇప్పటివరకు తన చేతుల మీదుగా సుమారు 30 నుంచి 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, ఏ ఒక్క కేంద్రానికి కూడా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఐకేపీ మహిళా సంఘాలు, పీఏసీఎస్ సిబ్బంది ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి లారీలు, గోదాములు, రైస్ మిల్లుల కేటాయింపులు లేకపోవడంతో వారు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.గత 15 రోజులుగా సంబంధిత అధికారులతో, గోదాముల నిర్వాహకులతో మాట్లాడుతున్నప్పటికీ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ అనుమతులు రాలేదనే సమాధానాలు చెబుతూ రైతులకు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించేందుకు అవసరమైన బార్దానాలు, లారీలు, రైస్ మిల్లుల కేటాయింపులు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని రోడ్ల పక్కన, కల్లాల్లో ఎండబోసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం కనీస కొనుగోలు ఏర్పాట్లు చేయకపోవడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, ప్రారంభంలో కొంతమేర మంచి ధర ఇచ్చిన వ్యాపారులు ఇప్పుడు ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ధరలు తగ్గిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర అందకుండా చేసి ప్రైవేటు వ్యాపారులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పెద్ద గోదాములోకి రైతులను ధాన్యం తీసుకెళ్లి ఆరబోసుకునేందుకు కూడా అనుమతించడం లేదని, గోదాము గేటుకు తాళం వేసి ఉంచారని తెలిపారు. కలెక్టర్ అనుమతి లేదనే సాకుతో రైతులను లోపలికి అనుమతించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులు ఎక్కడికి వెళ్లాలి? తమ ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకోవాలి? ఎవరికి అమ్ముకోవాలి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఒకవైపు రైతుల పట్ల తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రోడ్లపాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
గతంలో మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కాలువలకు నీళ్లు అందించి చెరువులు, కుంటలు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. కానీ నేడు కాలువల్లో నీళ్లు లేకుండా పోయాయని, చెరువులు, కుంటలు ఎండిపోయాయని, వాగులు, వంకల్లో సైతం నీటి జాడ లేకుండా పోయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో పశుపక్ష్యాదులకు కూడా తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
*ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి డిమాండ్లు*
1. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తక్షణమే ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయాలి.
2. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వెంటనే గోదాములు, రైస్ మిల్లులను కేటాయించాలి.
3. అన్ని మండలాల్లో వెంటనే ధాన్యం తరలింపునకు లారీలు, అవసరమైన బార్దానాలను అందుబాటులోకి తీసుకురావాలి.
4. దుబ్బాకలోని ప్రభుత్వ గోదామును రైతుల అవసరాలకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి.
5. రైతులు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
రైతు కష్టాన్ని గుర్తించని ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ప్రయోజనం లేదు. రైతు పండించిన ప్రతి గింజకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సర్పంచులు ఉపసర్పంచులు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత వైస్ చైర్ పర్సన్ ఆస సులోచన స్వామి, కౌన్సిలర్లు,పిఎసిఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లు, ఆయా శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు.



