ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ నాయక్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మూడవత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్ కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు ద్వారా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి, వాటి పరిష్కారానికి మరింత సమర్థవంతంగా కృషి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో గిరిజనుల అభ్యున్నతికి ఈ కమిషన్ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా గిరిజనులకు ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం లభించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి చేరేందుకు ప్రత్యేక కమిషన్ ఉపయోగపడుతుందని అన్నారు.
సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. గిరిజనుల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మూడవత్ శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు.



