నల్లూరులో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వనరులను సంరక్షించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్ద, ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవడమే లక్ష్యంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విఘ్నేష్, కారోబార్ గంగాధర్, సర్పంచ్ బర్కం గంగాధర్, ఫీల్డ్ ఆఫీసర్ భూమేష్, తదితరులు పాల్గొన్నారు.



