నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ
సభా స్థలాలను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి
తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలాల కోసం పలు ప్రాంతాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట్ స్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, రాకపోకలకు అనువైన మార్గాలపై అధికారులతో చర్చించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..నవంబర్ 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే మహిళలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని తెలిపారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి సభలో ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలు వివరాలను వెల్లడిస్తారని తెలిపారు.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన అంశంతో పాటు ఉద్యోగ నియామకాలు, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి తదితర కార్యక్రమాలపై కూడా వివరించనున్నట్లు చెప్పారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల తదితర నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ..
నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, ప్రజలకు సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, నూతన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.సభ వేదికగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదని పేర్కొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ సభ కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. నవంబర్ 19న సిద్దిపేటలో జరిగే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమావతి, వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



