దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:
దుబ్బాక: దుబ్బాక మార్కెట్ యార్డులో బుధవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సంగీత రవీందర్ తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి సూచించారు. రైతులకు ధాన్యం విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా,పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని, కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులకు అవసరమైన సహకారం అందించాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు.తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన అనంతరం అధికారులు ఆన్‌లైన్ ట్యాబ్‌లో లేదా ట్రక్ షీట్‌లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారని పేర్కొన్నారు. ధాన్యానికి సంబంధించిన కనీస మద్దతు ధర (MSP), బోనస్ మొత్తాలను విడివిడిగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వివరించారు.కావున రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు వర్తించే బోనస్‌ను పొందాలని కొంగరి రవి కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆస సులోచన స్వామి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగరం బాల్ రెడ్డి, డైరెక్టర్లు,ఆకుల భరత్,కడుదురి నరేందర్ రెడ్డి,మెట్ల సంజీవ్,చర్లపల్లి బాల్ రెడ్డి,పర్స నర్సింలు, మహమ్మద్ అజీజ్,దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు, కోటగళ్ల రమ్య రాజేష్,శ్రీరామ్ సరస్వతి నరేందర్, ఐరేని అఖిల సాయి తేజ గౌడ్, బండి శ్రీలేఖ రాజు,తునికి సురేష్, కోఆప్షన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



