తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్
దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానేత నెహ్రూడ
వ్యవసాయం, పరిశ్రమలు, విద్యారంగాల అభివృద్ధికి నెహ్రూ విశేష కృషి
నెహ్రూ–ఇందిరా గాంధీ కుటుంబం నాటిన అభివృద్ధి మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయి
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసి, ఎన్నికల ప్రక్రియకు పునాదులు వేసిన మహానాయకుడు నెహ్రూ
రాజ్యాంగ విలువలను కాపాడుతూ బలహీన వర్గాలకు అండగా నిలిచే పాలన అందించారు
శాసన, న్యాయ వ్యవస్థల బలోపేతానికి నెహ్రూ విశేష కృషి చేశారు
సోనియాగాంధీకి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పదవిని స్వీకరించలేదు
సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధిలో నెహ్రూ–ఇందిరా గాంధీ కుటుంబం పాత్ర ఎంతో గొప్పది
ఓడీఎఫ్, బీఈఎల్, బీడీఎల్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏర్పాటయ్యాయి
సింగూరు, మంజీర ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీటి సౌకర్యాలు అందాయి
నెహ్రూ–గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు, బలిదానాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి
సంగారెడ్డిలో ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానాయకుడు తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొనియాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. ప్రజలకు సరిపడా ఆహారం, పరిశ్రమలు, మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే దూరదృష్టితో నెహ్రూ ముందుకు సాగారని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యమిస్తూ నాగార్జునసాగర్ వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఐఐటీలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు.దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియ, శాసన, న్యాయ వ్యవస్థల పటిష్టతకు నెహ్రూ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలిచే పాలన అందించారని కొనియాడారు.నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రులుగా దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. సోనియాగాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ పదవిని స్వీకరించకుండా త్యాగానికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవులను అధిరోహించిన కుటుంబమైనప్పటికీ పదవుల కంటే దేశసేవకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు.ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధిలో నెహ్రూ–గాంధీ కుటుంబం పాత్ర మరువలేనిదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏర్పాటైన ఓడీఎఫ్, బీఈఎల్, బీడీఎల్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయని తెలిపారు. సింగూరు, మంజీర ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీటి సౌకర్యాలు అందాయని వివరించారు.నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయని, ఆ మహావృక్షాలు ప్రజలకు నీడనిస్తూ ఫలాలను అందిస్తున్నాయని జగ్గారెడ్డి అభివర్ణించారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ప్రాజెక్టుల ఫలాలను నేటికీ ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.దేశ నిర్మాణం కోసం నెహ్రూ–గాంధీ కుటుంబం చేసిన సేవలు, త్యాగాలు, బలిదానాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని పేర్కొన్నారు. దేశానికి బలమైన పునాదులు వేసిన ఆ కుటుంబం సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జగ్గారెడ్డి అన్నారు.



