ఒకరి మృతి..మరొకరికి గాయాలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ శివారులోని రామాలయం సమీపంలో శనివారం మధ్యాహ్నం సుమారు 12:15 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే, మాధాపూర్ గ్రామానికి చెందిన డొంకేశ్వర్ అశోక్ కుమారుడు డొంకేశ్వర్ హేమంత్ (ప్రశాంత్) (19), తన స్నేహితుడు గడ్డం నవీన్ (16) తో కలిసి హెచ్ ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ పై మాధాపూర్ గ్రామం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయికల్ వైపు నుంచి కోరుట్ల వైపుకు వస్తున్న టీజీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు, మోటార్ సైకిల్ లు ఎదురెదురుగా ఢీ కొనగా, ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న డొంకేశ్వర్ హేమంత్ (ప్రశాంత్) తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న గడ్డం నవీన్ తలకు రక్తగాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి డొంకేశ్వర్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.



