దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)
దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలు, రైతులు, బీడీ కార్మికులు, వృద్ధులు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి విజ్ఞప్తి చేశారు.సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం నగరం గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరామలింగేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
బీడీ కార్మికులు, వృద్ధులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి..
దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారని, కొత్తగా పీఎఫ్ కార్డులు మంజూరైన బీడీ కార్మికులకు కూడా అర్హత మేరకు పింఛన్లు అందించాలని కోరారు. గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో అనేకమంది అర్హులైన పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధులు, బీడీ కార్మికులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను పెంచాలని కోరారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కులవృత్తుల వారికి పింఛన్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
సాగునీటి కాలువల పనులు వెంటనే పూర్తి చేయాలి..
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఉపకాలువల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూసేకరణ పూర్తి చేసి, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, కాంట్రాక్టర్లను నియమించి కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. తద్వారా సాగునీటి సౌకర్యం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
దుబ్బాక మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నిధులు విడుదల చేయాలి.
గతంలో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరైన రూ.20 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ నిధులను తిరిగి మంజూరు చేసి పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. హబ్సిపూర్ నుంచి దుబ్బాక వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని పూర్తిగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టి, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామపంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
గ్రామపంచాయతీల్లో నిధుల కొరత కారణంగా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దుబ్బాక పరిధిలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త బోరుబావుల తవ్వకానికి అనుమతులు ఇచ్చి, అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ కరెంటు కోతలు లేకుండా చూడాలని, యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి దృష్టికి దుబ్బాక సమస్యలు తీసుకెళ్లాలి...
ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు, అభివృద్ధి పనులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రైతుల ప్రయోజనాలు, దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు.



