జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, గోపులాపూర్ గ్రామంలో నిన్న రాత్రి దొంగతనం ఘటన కలకలం రేపింది. గ్రామంలోని బస్టాండ్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఆరుగురు వ్యక్తులు ఆటోలో బస్టాండ్ దాటి కొంత దూరం వెళ్లిన అనంతరం, ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చినట్లు కనిపిస్తోంది. వారిలో ఇద్దరు వ్యక్తులు వైన్స్ వైపు వెళ్లగా, మరో వ్యక్తి బుగ్గారం వెళ్లే రోడ్డులోకి వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో బుగ్గారం రోడ్డులో గాజుల అజయ్‌కు చెందిన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు తెలిసింది. చోరీకి గురైన బైక్ నంబర్ TS 36 G 3369. మరోవైపు వైన్స్‌లో కూడా చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.సీసీటీవీ ఫుటేజీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించి ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టాలని, బైక్ చోరీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి: గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గోపులాపూర్ గ్రామ సర్పంచ్ బీర్పూరి తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.



