వాచ్ మెన్ బైక్ తో పాటు టీవీ, ప్రొజెక్టర్, ఫర్నిచర్ ధ్వంసం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 17 : కోరుట్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలుర) లో కొందరు విద్యార్థులు సోమవారం వాచ్మెన్‌పై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గతంలో విద్యార్థుల ప్రవర్తనపై ఇక్కడ పని చేసిన పాత ప్రిన్సిపాల్‌కు వాచ్మెన్ ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థులు, ప్రస్తుతం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వాచ్మెన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాచ్మెన్ కు తీవ్ర గాయాలు కాగా, వాచ్ మెన్ బైక్ తో పాటు టీవీ, ప్రొజెక్టర్, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. విధుల్లో ఉన్న సిబ్బందిపైనే విద్యార్థులు దాడికి దిగడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గురుకులంలో క్రమశిక్షణ, భద్రతను పటిష్టం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.



