మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఘాటు వాక్యాలు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20:
కాళ్లు మొక్కించుకునే సంస్కృతి నాది కాదు.. కాళ్లు మొక్కించుకున్న దొరల అహంకారాన్ని తరిమికొట్టిన సంస్కృతి నాది అని జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు.
ప్రశాంత్ రెడ్డి.. నన్ను సిగ్గులేదా అని అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది?ఆదివాసీ గిరిజన తెగలో పుట్టి, ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో ఎదిగి, రాష్ట్ర మంత్రిగా, నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించడం, అర్హులైన మహిళలకు సంక్షేమ పథకాలు అందించడం నా బాధ్యతగా అవి చేయడం నా తప్పా.రాష్ట్రంలో వచ్చిన మొత్తం పెన్షన్లలో 3.50 లక్షల మంది మహిళలకు పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నాకు తప్పా ?. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీలొ భాగస్వామ్యం అవడం నా తప్పా?పేదల కష్టాలు తీర్చడం, మహిళల జీవితాల్లో వెలుగులు నింపడం, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడం తప్ప నేను చేసిన తప్పేంటి?
ప్రజలకు సేవ చేయడమే నా నేరమా? అని ప్రశాంత్ రెడ్డిని సీతక్క ప్రశ్నించారు.ఒక మహిళగా, గిరిజన బిడ్డగా నేను ఎదుర్కొన్న కష్టాలు నాకు తెలుసు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను మహిళల ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శలు చేయాలంటే అభివృద్ధి, ప్రజా సమస్యలు, పాలన గురించి మాట్లాడాలి కానీ మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు.
నాపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ప్రశాంత్ రెడ్డి తన రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలి. మొన్నటికి మొన్న కేసీఆర్ కుటుంబానికి చెందిన బిడ్డే ప్రశాంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేసింది. సొంత రాజకీయ వర్గాల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ఇతరులకు సంస్కారం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని సీతక్క వ్యాఖ్యానించారు.ఆడబిడ్డల ఆత్మగౌరవం జోలికి వస్తే సహించేది లేదు!
నిజామాబాద్ జిల్లా ప్రజలు తనకు ఇచ్చిన గౌరవం, బాధ్యతను నిలబెట్టుకుంటూ పనిచేస్తానని సీతక్క తెలిపారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు. నా జోలికి వచ్చినా, ఆడబిడ్డల జోలికి వచ్చినా ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.బాల్కొండ రైతులకు రూ.100 కోట్ల ఎత్తిపోతల పథకం!రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క ప్రకటించారు.
ఎస్సార్ఎస్పీ వరద కాలువ నుంచి భీమ్గల్, వేల్పూర్, మోర్తాడ్ మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కార్యరూపం దాల్చితే ఆయా మండలాల్లోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తాం!సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి అందాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారితో పాటు అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పెన్షన్లు పొందలేకపోతున్న వారికి కూడా దశలవారీగా న్యాయం చేస్తామని తెలిపారు.
పేదల సంక్షేమం, మహిళల ఆర్థిక స్వావలంబన, రైతుల అభివృద్ధి, గిరిజనుల హక్కుల పరిరక్షణే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని సీతక్క పేర్కొన్నారు.
అధికారం అంటే ప్రజల చేత కాళ్లు మొక్కించుకోవడం కాదు.ప్రజలకష్టాల్లోపాలుపంచుకోవడంపదవులు అంటే అహంకారం ప్రదర్శించడం కాదు..బాధ్యతతో సేవ చేయడం. ఈ సూత్రంతోనే ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు



