*పిల్లలే మన భవిష్యత్తు - వారి హక్కులను రక్షిద్దాం : పలుస శంకర్ గౌడ్*
ప్రతి సంవత్సరం నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు దేవుడు ఇచ్చిన వరం, వారి చిరునవ్వే మన ఇంటికి వెలుగు అన్నారు. పిల్లల హక్కులను రక్షిద్దాం, వారి కలలకు రెక్కలొచ్చే సురక్షిత ప్రపంచాన్ని అందిద్దామని కోరారు.
ప్రతి పిల్లవాడికి చదువు, ఆరోగ్యం, ప్రేమ, రక్షణ పొందే హక్కు ఉందని తెలిపారు. పిల్లలను ప్రేమతో పెంచాలి, భయంతో కాదు, దండనతో కాదని అన్నారు. వారి మనసు చాలా సున్నితమని, మన మాట, మన ప్రవర్తన వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపి, ప్రతి బిడ్డను బడికి పంపడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆడపిల్ల, మగపిల్ల అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు.
పిల్లలకు మంచి సంస్కారం, నైతిక విలువలు, దేశభక్తి చిన్నప్పటి నుంచే నేర్పాలని, పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా వారిలో జ్ఞానం, ఊహాశక్తి పెరుగుతాయని తెలిపారు.
మొబైల్ కు బానిసలు కాకుండా, ఆటలు, పాటలు, కళల వైపు పిల్లలను ప్రోత్సహించాలని, పిల్లల ఆరోగ్యం కోసం మంచి ఆహారం, పరిశుభ్రత, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలని, వారి మాట వినాలని, వారిని అర్థం చేసుకోవాలని అన్నారు. బాల్యం ఒక్కసారే వస్తుందని, దానిని ఆనందంగా, భయం లేకుండా గడపనివ్వాలని కోరారు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం అందరూ కలిసి పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలని, పిల్లలపై జరిగే ఏ విధమైన హింస, వేధింపులను సహించకూడదని, వెంటనే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
నేటి బాలలే రేపటి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నాయకులని, వారి కలలను ఎగతాళి చేయకుండా, వారి కలలకు రెక్కలు తొడిగి ఎగరనిద్దామని అన్నారు.
సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా తరపున ప్రతి బిడ్డకు మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నానని, పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, విజ్ఞానంతో ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
*- పలుస శంకర్ గౌడ్*
*జిల్లా అధ్యక్షులు, సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా*



