Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం

Author
Posted By D RAMAKRISHNA
| 22 Nov 2026, 04:05 PM | 10 | TELANGANA, ఖమ్మం, తెలంగాణ
పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం
పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం
చలో ఢిల్లీ’కి సంపూర్ణ మద్దతు
  •   సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
  •    జిల్లా కార్య దర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, నవంబర్ 22  : 
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి, ఇప్పటికే 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అంచనా వేసి ప్రకటించినప్పటికీ, కరువు వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఆదివారం సిపిఐ ( ఎం ) ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల తో పాటు ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పలు జిల్లాల కార్యదర్శులతో కలిసి మాట్లాడారు.
​ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని చెబుతున్నా, వాస్తవంగా మరో ఐదారు లక్షల ఎకరాలు అదనంగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఒక ఎకరంలో వాణిజ్య పంటలు వేస్తే రైతుకు రూ. 50 వేల వరకు, వరి లాంటి పంటలు వేస్తే రూ. 30 వేలకు తక్కువ కాకుండా ఖర్చవుతుండగా, ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రైతులకు నష్టపరిహారం అందిస్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం ప్రకటించలేదని ఆయన దుయ్యబట్టారు. ఈ కరువు కారణంగా బోర్లన్నీ ఎండిపోయి తాగునీటి, సాగునీటి సమస్యలతో పాటు ఉపాధి సమస్య కూడా తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు.  ​కేవలం సమీక్షలు, సమావేశాలు జరపడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రివర్గం గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని జాన్ వెస్లీ విమర్శించారు. తక్షణమే వరి పంటకు ఎకరాకు రూ. 30 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ. 50 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని సీపీఐ(ఎం) పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం నష్టాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కనీసం రూ. 50 వేల కోట్లు డిమాండ్ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ని కోరారు.  బెంగాల్‌లో 24 లక్షల ఓట్లను తొలగించిన తరహాలోనే, తెలంగాణలోనూ దాదాపు 93 లక్షల ఓట్లను బ్లాక్ లిస్టులో పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ఓట్లను కాపాడుకోవడానికి ఈ నెల 26న దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ​రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు భర్తీ చేయలేదని  అన్నారు. రాష్ట్రంలో కోటి 16 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, కార్డుపై మనిషికి 6 కేజీల బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని  ఎద్దేవా చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, బియ్యాన్ని 10 కేజీలకు పెంచడంతో పాటు పప్పు, మంచినూనె సహా 14 రకాల సరుకులను రేషన్ కార్డుపై అందించాలని, తద్వారా దేశంలో ఉన్న 40 శాతం మంది మహిళల రక్తహీనత, పిల్లల పోషకాహార లోపాన్ని నివారించవచ్చని సూచించారు.  కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుండి 3 వరకు కార్మిక సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, బండారు రవికుమార్,ఖమ్మం,నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పి. వీరారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జహంగీర్ తో పాటు పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: