మీరాలం కుంట ఫెన్సింగ్ పేరుతో పట్టా భూముల్లోకి చొరబాటు?
- సాగు భూముల్లో కంచె వేస్తుండటంపై రైతుల ఆగ్రహం
- అభ్యంతరం వ్యక్తం చేస్తే కార్యాలయానికి రావాలంటూ అధికారుల సమాధానం
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి: చెరువులు, కుంటల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా అధికారుల చర్యలు ఇప్పుడు రైతుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడ పరిధిలోని మీరాలం కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో, తమ పట్టా వ్యవసాయ భూముల్లోనూ కంచె వేస్తున్నారని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం కుంట చుట్టూ కంచె ఏర్పాటు పేరుతో తమ పొలాల్లోకి వచ్చి ఫెన్సింగ్ వేస్తుండటంతో సాగు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు, తమ సొంత పట్టా భూముల్లోకి వచ్చి కంచె వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రైతులు అధికారులను నిలదీయగా, అభ్యంతరాలు ఉంటే కార్యాలయానికి వచ్చి కలవాలని సమాధానం ఇచ్చినట్లు బాధితులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించి పరిష్కరించాల్సిన అధికారులు ఇలా సమాధానం ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, రెవెన్యూ అధికారుల సమక్షంలో భూముల హద్దులను నిర్ధారించకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టడంపై రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. కుంట పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో తమ పట్టా భూములకు నష్టం కలిగించవద్దని స్పష్టం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించాలి మీరాలం కుంట చుట్టూ చేపడుతున్న ఫెన్సింగ్ పనులను తక్షణమే పరిశీలించి, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కుంట అసలు హద్దులను పారదర్శకంగా నిర్ధారించిన తర్వాతే కంచె పనులు చేపట్టాలని, రైతుల పట్టా భూములకు ఎలాంటి నష్టం కలగకుండా న్యాయం చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.



