భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ సమీపంలో మానవ పుర్రెలు, ఎముకల అవశేషాలు – సమగ్ర విచారణకు బీజేపీ–బీజేవైఎం డిమాండ్
భువనగిరి:భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సమీపంలో కాలిన స్థితిలో కనిపించిన మానవ పుర్రెలు, ఎముకల అవశేషాల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ–బీజేవైఎం భువనగిరి పట్టణ కమిటీల ఆధ్వర్యంలో 23-11-2026న జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినతిపత్రం సమర్పించారు.ఈ ఘటనను 18-11-2026న బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం గారు స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వివరణ కోరగా, అవి మెడికల్ కళాశాల ల్యాబ్‌కు చెందిన పాత బోధనా నమూనాలని ఆయన తెలిపినట్లు ప్రతినిధులు వెల్లడించారు. అయితే, వాటి అసలు మూలం, చట్టబద్ధమైన సేకరణ, భద్రపరిచిన విధానం, వినియోగం మరియు తొలగింపునకు సంబంధించిన ఆధార పత్రాలను చూపించలేదని పేర్కొన్నారు.
ఈ విషయంపై బీజేవైఎం భువనగిరి పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ గారు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీ)లో డైరీ నంబర్ 1992/ఐఎన్ /2026, తేదీ 20-11-2026 ద్వారా ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేశారు.
జిల్లా కలెక్టర్ గారు ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశించి, మెడికల్ కళాశాల ల్యాబ్ రికార్డులు, నమూనాల మూలం, మార్చురీ రిజిస్టర్లు, బదిలీ పత్రాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు వాటి తొలగింపునకు సంబంధించిన అనుమతులను పరిశీలించాలని నాయకులు కోరారు. నిబంధనల ఉల్లంఘన లేదా అధికారుల నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మానవ అవశేషాల నిర్వహణలో పారదర్శకత, మానవ గౌరవం, ప్రజారోగ్యం మరియు అధికారుల జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని, ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని బీజేపీ–బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, బీజేవైఎం భువనగిరి పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్, కొల్లోజు శ్రవణ్, కొలిచెలిమి మల్లికార్జున్, పెంటబోయిన నాగరాజు, కొత్త భారత్, గుర్రం ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ–బీజేవైఎం భువనగిరి పట్టణ కమిటీ



