దుబ్బాక,నవంబర్ 07,తెలంగాణ కెరటం :
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో మంజూరై నిర్మాణాలు పూర్తయిన నూతన గృహాల్లో ఈ నెల 8వ తేదీన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. లలిత కుమారి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం నుంచి వచ్చిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ” స్టిక్కర్లను నవంబర్ 8న నూతన ఇందిరమ్మ ఇళ్లకు అతికించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ డి. లలిత కుమారి కోరారు.



