డయల్-100కు వచ్చిన సమాచారంతో హుటాహుటిన చేరుకుని ఇద్దరినీ రక్షించిన పెట్రోలింగ్ సిబ్బంది
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్, ప్రతినిధి /నవంబర్ 9: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా, ఘట్కేసర్ పోలీసులు సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేట్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేట్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు డయల్-100 ద్వారా సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్-2 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రైల్వే ట్రాక్‌పై ఉన్న మహిళను, ఆమె కుమార్తెను చాకచక్యంగా రక్షించి ప్రమాదం నుంచి కాపాడారు. అనంతరం పోలీసులు మహిళను విచారించగా, భర్త వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పి, కౌన్సెలింగ్ నిర్వహించి మానసికంగా స్థైర్యం కల్పించారు. అనంతరం తల్లీకూతుళ్లను సురక్షితంగా ఆమె సోదరి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి రెండు విలువైన ప్రాణాలను కాపాడిన పెట్రోలింగ్-2 ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ పరమేష్‌తో పాటు సిబ్బందిని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కిరణ్ అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.



