పునరావాసంలో భాగంగా తాటిగుండాల చెంచులకు ఇళ్ల పట్టాల పంపిణీ.
9 గిరిజన కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాల కేటాయింపు.
పట్టా డాక్యుమెంట్లను అందజేసిన అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేశం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 18):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం
అమ్రాబాద్ మండలం
నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల పునరావాస ప్రక్రియలో భాగంగా బుధవారం అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తాటిగుండాల చెంచుపెంట గిరిజన వాసులకు అటవీ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.తాటిగుండాల చెంచుపెంటకు చెందిన మొత్తం 15 చెంచు కుటుంబాలు పునరావాసం కోసం దరఖాస్తు చేసుకోగా, నిబంధనల ప్రకారం అర్హులైన 9 మంది లబ్ధిదారులకు తొలి విడతలో పట్టాలను మంజూరు చేశారు. ఒక్కో కుటుంబానికి 250 గజాల చొప్పున కేటాయించిన ఇంటి స్థలాల పట్టా డాక్యుమెంట్లను అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేశం లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.పునరావాస ప్యాకేజీలో భాగంగా గిరిజన కుటుంబాలకు మెరుగైన మౌలిక సదుపాయాలతో కూడిన నివాస స్థలాలను అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరలోనే అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు తాటిగుండాల చెంచుపెంట వాసులు పాల్గొన్నారు.



