చుట్టూ పిచ్చి మొక్కలు, విషపురుగులుపందుల సంచారంతో విద్యార్థుల బెంబేలు
అధ్వాన్నంగా మారిన హాస్టల్ రహదారి
తక్షణమే చర్యలు తీసుకోవాలని* *అధికారులకు వినతి
నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం
నందిపేట్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల ఎస్సీ బాలుర వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. హాస్టల్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
హాస్టల్ భవనం చుట్టూ భారీగా పిచ్చి మొక్కలు, తుప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. పిచ్చి మొక్కల కారణంగా తరచూ పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు హాస్టల్ ఆవరణలోకి వస్తుండటంతో రాత్రి వేళల్లో విద్యార్థులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, హాస్టల్‌కు వెళ్లే నడక దారి రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. గుంతలమయమైన ఈ దారిలో రాకపోకలు సాగించడం విద్యార్థులకు కత్తిమీద సాములా తయారైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సరైన దారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే హాస్టల్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, పందుల బెడదను అరికట్టాలని కోరుతున్నాము. అలాగే విద్యార్థుల రాకపోకలకు వీలుగా హాస్టల్ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.



