*కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు*
ఈ నెల 29న ఉప్పల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం.. భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్రాల సందర్శన
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉప్పల్ డిపో ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సు యాత్రను ఏర్పాటు చేశారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం ఈ యాత్ర ప్రారంభం కానుంది. పంచారామ క్షేత్రాలతో పాటు పలు ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించుకునేలా ఈ యాత్రను రూపొందించారు. ఈ యాత్రలో భాగంగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించారు. నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉప్పల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి, సోమవారం ఉదయం ఏడు ఆలయాల దర్శనం అనంతరం మంగళవారం ఉదయం హైదరాబాద్కు చేరుకుంటుంది.
టికెట్, దర్శనం వివరాలు:
బస్సు ప్రయాణ టికెట్ ధర రూ.3,200. దర్శనం టికెట్లు రూ.500. భోజన, వసతి సదుపాయాల బాధ్యత ప్రయాణికులదే. పంచారామ క్షేత్రాలతో పాటు వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, వేయి స్తంభాల గుడి, కొలనుపాక వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించేలా యాత్రను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకుని దైవదర్శనం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం 8096668766, 9908674387, 9391107302 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు. పైన తెలిపిన వివరాలను తమ పరిచయస్తులు, భక్తులకు తెలియజేసి యాత్ర విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.



